యూపీలో భార్యను చంపి వాట్సాప్ స్టేటస్..తర్వాత చెల్లెను చంపి తానూ సూసైడ్

యూపీలో భార్యను చంపి వాట్సాప్ స్టేటస్..తర్వాత చెల్లెను చంపి తానూ సూసైడ్
  • యూపీలో ఎస్​బీఐ ఉద్యోగి దారుణం

లక్నో: వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో స్టేటస్ పెట్టి మరీ భార్య, సోదరిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. ఆ తర్వాత తానూ తుపాకీతో కాల్చుకుని సూసైడ్​చేసుకున్నాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. లక్నోలో నివాసం ఉంటున్న మానస్ బాజ్‌‌‌‌‌‌‌‌పేయి(38), దివ్యా మిశ్రా భార్యాభర్తలు.  వీళ్ల వివాహమై 12 ఏళ్లు కాగా, పిల్లలు లేరు. మానస్ ఎస్​బీఐలో జాబ్ చేస్తుండగా.. దివ్య ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తోంది.

ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో విడాకుల కోసం అప్లయ్​ చేసుకోగా విచారణ సాగుతోంది. గురువారం భార్య పనిచేసే బ్యాంక్ దగ్గరకు వెళ్లిన మానస్.. మాట్లాడాలంటూ ఆమెను బయటకు పిలిచాడు. ఆమె రాగానే తన దగ్గరున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దివ్య అక్కడికక్కడే చనిపోయింది. అక్కడి నుంచి బయలుదేరిన మానస్.. ఈ దారుణాన్ని వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో స్టేటస్ పెట్టాడు. ‘ఈరోజు నేను నా భార్యను చంపేశాను.. ఎందుకంటే ఆమె నన్ను మోసం చేసింది.

ఇప్పుడు నా సోదరిని హత్య చేసి తర్వాత నేను కూడా చనిపోతా’ అంటూ అందులో రాసుకొచ్చాడు. చెప్పినట్లుగానే నేరుగా ఇంటికి వెళ్లిన మానస్.. దివ్యాంగురాలైన తన సోదరి శివ వాజ్‌‌‌‌‌‌‌‌పేయిని కూడా కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి ఇల్లు పరిశీలించి మూడు ఆయుధాలు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. లక్నోలో జరిగిన ఈ జంట హత్యలు, ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది